
టేకుమట్ల: ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేష్, ఉదయ్ కుటుంబాన్ని వరంగల్ మాజీ ఎంపీ, ప్రణాళిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఆదివారం పరామర్శించారు. రవి స్వగ్రామమైన వెలిశాలలో కుటుంబ సభ్యులను కలిసిన ఆయన, తమ్ముడు అశోక్, అన్న సారయ్య కుమారుడు నవీన్లతో మాట్లాడి ఎన్కౌంటర్ జరిగిన తీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, రవి యువకుడిగా ఉద్యమ మార్గంలో అడుగుపెట్టి కుటుంబాన్ని, ఊరును మరచి ప్రజాసేవ లక్ష్యంగా జీవితాన్ని అర్పించాడని, చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఆయన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, జిల్లా నాయకులు కత్తి సంపత్ గౌడ్, వీరవేణి శ్రీనివాస్, బండి రవీందర్, వంగ నరేష్, సంగీ రవి, కోరే చంద్రమౌళి, జంగాపల్లి సారయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
