
నవీపేట, జూన్ 2(zindagi9news):నవీపేట మండల కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రెండోరోజు రిలే నిరాహార దీక్షకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇందిరమ్మ కమిటీల నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు.
నవీపేట మండలంలో 600 మంది లబ్ధిదారులను గుర్తించినప్పటికీ, కేవలం 100 మందికి మాత్రమే మంజూరు పత్రాలు ఇవ్వడం వివాదాస్పదమని, అందులో కూడా కాంగ్రెస్ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని తెలిపారు. “నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనుచర గణానికి ఇండ్లు కేటాయించడం అన్యాయం” అని పేర్కొన్నారు.
ఇందిరమ్మ కమిటీల్లో అన్ని పార్టీల ప్రతినిధులను చేర్చకపోవడం వల్లే అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని, అఖిలపక్ష సభ్యులను కమిటీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఏర్పడిన కమిటీలు పాక్షికంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. “వడ్డించే వాడు మనవాడైతే ఏ మూలనైనా ముక్కలు పడతాయి అన్నట్టు పరిస్థితి మారింది” అని వ్యాఖ్యానించారు.
దర్యాపూర్ శివారులో 9000 జనాభా ఉన్న గ్రామానికి కేవలం 3 ఇండ్లను కేటాయించడాన్ని నిరసిస్తూ, వెంటనే సర్వే నిర్వహించి అర్హులైన వారికి స్థలాలు, ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే సిపిఎం పార్టీ అఖిలపక్షాలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతుందని హెచ్చరించారు.
“ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామని చెప్పి, వాస్తవంగా కేవలం అనుకూల పార్టీలవారికే ఇస్తున్న తీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేస్తోంది. ఇది ప్రభుత్వ ప్రతిష్టకు తీవ్ర దెబ్బ” అని అన్నారు.
