హైదరాబాద్, మే 7: దేశ భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర అత్యవసర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజా పరిస్థితులపై సమీక్ష జరిపిన సీఎం, వివిధ విభాగాల అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
భారత సైనిక బలగాలకు సంఘీభావంగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ మేరకు గురువారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు “తీవ్రవాద వ్యతిరేక పోరాటానికి సంఘీభావ ర్యాలీ” చేపట్టాలని సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఇలాంటి కీలక పరిస్థితుల్లో రాజకీయ పార్టీల వివాదాలకు తావు లేదని స్పష్టం చేసిన సీఎం, ఎలాంటి పరిస్థితిని అయినా సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలూ సిద్ధంగా ఉండాలన్నారు. అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులను రద్దు చేయాలని, మంత్రులు, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అలాగే విదేశీ పర్యటనలు తక్షణమే రద్దు చేయాలని స్పష్టం చేశారు.
వైద్యం, విద్యుత్, పౌర సరఫరాలు వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సూచనలు చేశారు.
సోషల్ మీడియాలో పుకార్లు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. ఫేక్ న్యూస్ నివారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేసి పర్యవేక్షణను ముమ్మరం చేయాలని, జిల్లాల కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేయాలని సూచించారు. పీస్ కమిటీలతో సమయానుకూలంగా సమావేశాలు నిర్వహించి, పాత నేరచరిత్ర కలిగిన వారిపై నిరంతర నిఘా పెట్టాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ అత్యవసర సమీక్ష సమావేశంలో రాష్ట్ర పోలీస్ శాఖ, ఆర్మీ, సివిల్ డిఫెన్స్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
