TG ఇంటర్ అడ్మిషన్లకు తుది గడువు: ఆగస్టు 20 వరకు అవకాశం

హైదరాబాద్, జూలై 31: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మరోసారి పొడిగించింది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆగస్టు 20, 2025 వరకు చివరిసారిగా అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఆ తేదీ తర్వాత మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది.
అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు ఆలస్యంగా కళాశాల ఎంపిక చేసుకుంటుండటంతో వారికి ఈ అవకాశం ఇవ్వనుంది.
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆగస్టు 20లోగా అడ్మిషన్ ప్రక్రియ పూర్తిచేయాలని బోర్డు ఆదేశించింది. విద్యార్థులు గుర్తింపు పొందిన కళాశాలలలోనే ప్రవేశం తీసుకోవాలని, గుర్తింపు లేని సంస్థల ద్వారా అడ్మిషన్ తీసుకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించింది. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా కోసం tgbie.cgg.gov.in, acadtgbie.cgg.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించింది.
