నాగ్‌పూర్‌లో SBI బ్యాంక్‌లో దోపిడీ.. కారంపొడి చల్లి రూ.4.53 లక్షలు ఎత్తుకెళ్లిన వ్యక్తి

నాగ్‌పూర్, సెప్టెంబర్ 11: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎస్బీఐ బ్యాంకులో సంచలన దోపిడీ జరిగింది. కస్టమర్లా బ్యాంకులోకి ప్రవేశించిన ఓ యువకుడు క్యాష్ కౌంటర్ వద్ద పనిచేస్తున్న సిబ్బందిపై కారంపొడి చల్లి రూ.4.53 లక్షల నగదును దోచుకుని పారిపోయాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించి సుమారు 30 నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నాగ్‌పూర్‌లోని సక్కర్దరా పోలీస్ స్టేషన్ పరిధిలోని భాండే ప్లాట్‌లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాష్ కౌంటర్ వద్దకు వెళ్లిన నిందితుడు.. బ్యాంకు సిబ్బంది కళ్లలో కారంపొడి చల్లి, కౌంటర్లో ఉన్న నగదును బ్యాగ్‌లో వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
బ్యాంకు సిబ్బంది కేకలు వేయడంతో సమీపంలో గస్తీ నిర్వహిస్తున్న సక్కర్దరా పోలీస్ స్టేషన్ డిటెక్షన్ బ్రాంచ్ (DB) సిబ్బంది అప్రమత్తమయ్యారు. నిందితుడిని వెంబడించి సమీపంలోనే పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన వ్యక్తిని నాగ్‌పూర్ జిల్లా భివాపూర్ తాలూకా తటోలి గ్రామానికి చెందిన సూరజ్ భోజ్‌రాజ్ బోర్కర్ (28)గా గుర్తించారు. అతను బి.ఎస్సీ చదివిన పట్టభద్రుడని, ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి దోచుకున్న రూ.4.53 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులోని సీసీటీవీ కెమెరాల్లో ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డైనట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
