
లంచం కేసులో సైబర్ క్రైమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ అరెస్ట్.. ఏసీబీ వలలో అధికారి
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బత్తుల మహేందర్ లంచం కేసులో ఏసీబీకి చిక్కాడు. ఫిర్యాదుదారుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను సైబర్ మోసం కేసులో ఇరికించకుండా ఉండేందుకు అధికారిక సహాయం చేస్తానంటూ రూ.9 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 లక్షలు నగదు రూపంలో స్వీకరించిన ఇన్స్పెక్టర్, మిగిలిన రూ.4 లక్షల కోసం ఒత్తిడి చేసి బెదిరించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం ఆయన కార్యాలయంలో ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (CIU) అధికారులు పట్టుకున్నారు.
అనంతరం ఇన్స్పెక్టర్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో లెక్కల్లో లేని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆస్తులపై మరింత విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
అరెస్టు చేసిన అధికారిని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలు భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది.
