24 గంటల్లో హత్య కేసును ఛేదించిన జమ్మికుంట పోలీసులు
భూ వివాదమే హత్యకు కారణం.. మృతదేహాన్ని పొలంలో పూడ్చిపెట్టిన నిందితులు

జమ్మికుంట, సెప్టెంబర్ 16: జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో జరిగిన బొజ్జపల్లి రాజబాబు హత్య కేసును జమ్మికుంట పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. పట్టణ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. మృతుడు బొజ్జపల్లి రాజబాబు తన తల్లి లచ్చమ్మకు చెందిన భూమి విషయంలో కుటుంబ సభ్యులతో తరచూ వివాదానికి దిగేవాడు. భూమిని విక్రయించాలని రాజబాబు కోరగా కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భూమిని మూడు వాటాలుగా విభజించాలని నిర్ణయించినప్పటికీ, భూమి మొత్తం తనకే చెందాలని రాజబాబు పట్టుబట్టినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో రాజబాబు మద్యం సేవించి తనుగులలోని తన బావ జూపాక శంకర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్న తన తల్లి లచ్చమ్మ, అక్క కవితతో గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు వారించేందుకు ప్రయత్నించగా రాజబాబు తన తల్లి వెంట్రుకలు పట్టుకుని లాగడంతో ఘర్షణ తీవ్రరూపం దాల్చినట్లు పోలీసులు తెలిపారు.
అప్పటికే మద్యం సేవించి ఉన్న జూపాక శంకర్, చేతి వెంకటేష్, మారపెల్లి రాజయ్య, జూపాక సతీష్ తదితరులు రాజబాబును పట్టుకుని కొట్టి మంచంపై పడవేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అతని చేతులు, కాళ్లను మంచానికి కట్టివేసి, జూపాక శంకర్ చున్నీతో రాజబాబు మెడకు బిగించడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
రాజబాబు మృతి చెందిన అనంతరం ఘటనను దాచిపెట్టేందుకు మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, అదే రాత్రి సైకిల్‌పై తనుగుల గ్రామ శివారులోని పొలానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ పార, గడ్డపారలతో గుంత తవ్వి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైభాగంలో మట్టి, తుమ్మ పొరకతో కప్పినట్లు విచారణలో వెల్లడైంది.
ఈ కేసులో మృతదేహాన్ని పూడ్చేందుకు ఉపయోగించిన పార, గడ్డపార, మృతదేహాన్ని తరలించిన సైకిల్, మెడ బిగించేందుకు ఉపయోగించిన చున్నీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భూ వివాదాలు, కుటుంబ సమస్యలు లేదా ఇతర వ్యక్తిగత వివాదాల విషయంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించి చట్టపరంగా సమస్యలను పరిష్కరించుకోవాలని జమ్మికుంట పోలీసులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
