
మూడేళ్లలో అంగన్వాడీలకు సొంత భవనాలు – సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీలను వచ్చే మూడేళ్లలో సొంత భవనాల్లోకి మార్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
శాసనసభ సమావేశ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ చిన్నారుల కోసం ప్రారంభించిన ‘తొలి ముద్ద’ బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పిల్లలకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు. గర్భిణీ దశ నుంచే శిశువుకు అవసరమైన పోషకాహారం, పుట్టిన తర్వాత పిల్లల ఎదుగుదలపై సమగ్రంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ప్రభుత్వం తీసుకొచ్చే మంచి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సిబ్బంది సమర్థంగా అమలు చేసినప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం స్పష్టం చేశారు. అంగన్వాడీ సిబ్బంది తల్లిలా పిల్లల అవసరాలను అర్థం చేసుకుని బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
పిల్లల జీవితంలో తొలి ఆరు సంవత్సరాలు అత్యంత కీలకమైనవని, ఈ దశలో సరైన పోషకాహారం అందకపోతే ఎదుగుదలపై ప్రభావం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దేశంలో పోషకాహార లోపం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, చికిత్సపై ఖర్చు పెట్టడం కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం అవసరమని అన్నారు.
అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడిన వెంటనే వారి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, అంగన్వాడీ టీచర్లు, చిన్నారులు పాల్గొన్నారు.
