కరీంనగర్లో ఏసీబీకి చిక్కిన డిప్యూటీ జైలర్
ఖైదీకి సౌకర్యాల కల్పన పేరుతో రూ.10 వేల లంచం.. మధ్యవర్తిగా పెట్రోల్ బంక్ ఆపరేటర్

హుజురాబాద్, సెప్టెంబర్ 7: ఖైదీకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ములాఖత్‌లకు అవకాశం కల్పించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడటం కోసం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ తెలిపిన వివరాలు ప్రకారం .. హుజూరాబాద్ సబ్‌జైలు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ (46), ఇండియన్ ఆయిల్ సబ్‌జైలు పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ (30)లు లంచం వ్యవహారంలో పట్టుబడ్డారు.
రిమాండ్ ఖైదీగా ఉన్న ఫిర్యాదుదారుడి మామకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ములాఖత్‌లకు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూడడం కోసం డిప్యూటీ జైలర్ దేవేందర్ రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఆ మొత్తాన్ని హరీశ్ ద్వారా స్వీకరిస్తుండగా సోమవారం సాయంత్రం 5:45 గంటల సమయంలో ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు పట్టుకున్నారు.
హరీశ్ వద్ద నుంచి రూ.10 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. రసాయన పరీక్షలు నిర్వహించగా అతడి కుడి, ఎడమ చేతి వేళ్లకు పాజిటివ్ ఫలితం వచ్చినట్లు వెల్లడించారు.
డిప్యూటీ జైలర్ దేవేందర్ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు తెలిపింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. వాట్సాప్ ద్వారా 9440446106 నంబర్‌కు కూడా సమాచారం ఇవ్వవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
