ఆర్మూర్‌లో అంబేద్కర్ విగ్రహానికి అవమానం!
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై దళిత సంఘాల ఆగ్రహం.. కమిషనర్‌కు వినతిపత్రం
గౌరవప్రదమైన స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి: ఇందారపు రాజు మాదిగ

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, అక్టోబర్ 16 (జిందగీ 9 న్యూస్):ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయ పరిధిలో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని చిరిగిన ఫ్లెక్సీలు, బ్యానర్ల మధ్య రోడ్డుపై ఉంచడం ఆయనకు అవమానకరమని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకుడు ఇందారపు రాజు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహం పట్ల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై స్పందించి విగ్రహానికి తగిన గౌరవం కల్పించాలని కోరుతూ దళిత సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఇందారపు రాజు మాదిగ మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవప్రదమైన స్థలంలో ఏర్పాటు చేయకుండా చిరిగిన బ్యానర్ల మధ్య నిర్లక్ష్యంగా ఉంచడం బాధాకరమన్నారు. మున్సిపల్ కార్యాలయానికి అనేకమంది అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు వచ్చిపోతున్నప్పటికీ విగ్రహం పరిస్థితిని పట్టించుకోకపోవడం విచారకరమని అన్నారు. గత కొంతకాలంగా పలువురు కమిషనర్లు మారుతున్నా విగ్రహాన్ని తగిన స్థలానికి తరలించడంలో చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించారు.
అంబేద్కర్ చౌరస్తాలో ఆయనకు పూజలు చేస్తూ నివాళులర్పించే నాయకులు, మున్సిపల్ కార్యాలయంలో మాత్రం ఆయన విగ్రహాన్ని ఈ విధంగా ఉంచడంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వివిధ కార్యక్రమాలు, పండుగల నిర్వహణకు నిధులు ఖర్చు చేస్తున్న అధికారులు, భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని గౌరవప్రదంగా ఏర్పాటు చేయడంపై ఎందుకు దృష్టి సారించడం లేదని నిలదీశారు.
ఈ అంశంపై సబ్ కలెక్టర్ వెంటనే స్పందించి విగ్రహాన్ని ప్రస్తుత స్థలం నుంచి తొలగించి, గౌరవప్రదమైన ప్రదేశంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విగ్రహాన్ని ఎవరు తీసుకొచ్చారు, ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారనే విషయాలపై మున్సిపల్ సిబ్బందికి స్పష్టత లేకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలు కలిగిస్తోందని అన్నారు.
దళితుల పట్ల, వారి విగ్రహాలు, భూముల పట్ల వివక్ష చూపే ధోరణిని విడనాడాలని ఆయన కోరారు. అంబేద్కర్ కేవలం ఒక విగ్రహం కాదని, భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ ప్రజలకు మార్గదర్శకుడని పేర్కొన్నారు. ఆయనకు తగిన గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
కమిషనర్‌కు వినతిపత్రం
అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవప్రదమైన స్థలంలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. విగ్రహానికి తగిన గౌరవం కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు స్పందించకపోతే ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలతో కలిసి ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఇందారపు రాజు మాదిగ హెచ్చరించారు. విగ్రహాన్ని దళిత సంఘాలకు అప్పగించి, తగిన స్థలంలో ప్రతిష్ఠించి భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు నరసయ్య, గంగారం, మల్లేష్, సాయిరాం, భూషణ్, సాటిగర్ హరి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
