జమ్మికుంటలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి.. వైద్యుడి నిర్లక్ష్యంపై ఫిర్యాదు

జమ్మికుంట, అక్టోబర్ 16 (జిందగీ 9 న్యూస్): జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తి మృతి చెందడంపై వైద్యుడి నిర్లక్ష్యం కారణమంటూ మృతుడి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు వివరాల ప్రకారం..
కొత్తపల్లి గ్రామానికి చెందిన కొక్కుల సమ్మయ్య (60) పది రోజుల క్రితం ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లగా మెట్లు తగిలి కిందపడటంతో కుడి కాలుకు గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు మొదట జమ్మికుంటలోని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, కుడి కాలుకు ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. అనంతరం కార్తికేయ ఆస్పత్రికి తీసుకెళ్లి డాక్టర్ శరత్‌బాబు వద్ద చికిత్స చేయించారు. తొలుత కాలుకు కట్టు కట్టి పంపించగా, ఆరు రోజుల తర్వాత మళ్లీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు మందులు ఇచ్చి పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్టోబర్ 15న తిరిగి ఆస్పత్రికి తీసుకెళ్లగా కట్టు విప్పి పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. అనంతరం వైద్యుడి సూచన మేరకు ఇంజెక్షన్లు ఇచ్చిన కొద్దిసేపటికే సమ్మయ్యకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి, వణుకుతూ అస్వస్థతకు గురైనట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. వైద్యుడు సీపీఆర్ చేసి ఆక్సిజన్ అందించిన అనంతరం హనుమకొండకు తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు మ్యాక్స్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో అక్కడికి చేరుకునేసరికి సమ్మయ్య మృతి చెందినట్లు తెలిపారు. చికిత్స సమయంలో నిర్లక్ష్యం వహించి అధిక మోతాదులో మందులు లేదా ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే తన తండ్రి మృతి చెందాడని కుమారుడు కొక్కుల శివకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సమాచారం. వైద్య నిర్లక్ష్యం జరిగిందా, మృతికి గల ఖచ్చితమైన కారణాలేమిటన్నది విచారణలో తేలాల్సి ఉంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
