రైతులకు ఇబ్బందులు కలగకుండా భూముల రీ-సర్వే నిర్వహించాలి: ఏడీ డి. శ్రీనివాస్
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం.. పెద్దవాల్గొట్లో గ్రామసభ

నిజామాబాద్ రూరల్(సిరికొండ), అక్టోబర్ 14 (జిందగీ 9 న్యూస్): రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూముల రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా పూర్తి చేయాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ (AD) డి. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గొట్ గ్రామంలో భూముల రీ-సర్వే ప్రక్రియపై నిర్వహించిన గ్రామసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. రీ-సర్వే పూర్తయితే రైతుల భూముల సరిహద్దులకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించే ముందు సంబంధిత రైతులకు తప్పనిసరిగా ముందస్తు సమాచారం అందించాలని, వారి సమక్షంలోనే సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే నిర్వహిస్తున్నందున భూముల హద్దుల వివరాలను నమోదు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సర్వేయర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన 399వ సర్వే నంబర్ అంశాన్ని నర్సింగ్ అనే రైతు గ్రామసభ దృష్టికి తీసుకురాగా, దానికి సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ డి. శ్రీనివాస్‌తో పాటు డీఐ శివకుమార్, స్థానిక సర్పంచ్ పిట్ల వనిత నర్సింగారావు, ఉపసర్పంచ్ రాములు, ఎమ్మార్వో రవీందర్, ఎంపీడీవో రఫీ అహ్మద్, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, పంచాయతీ కార్యదర్శి, జీపీఓలు, సర్వేయర్లు, వీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సంబంధిత అధికారులు, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
