రెండేళ్లలో పెట్టుబడులు రెట్టింపు చేస్తామని టోకరా.. క్రిప్టో పేరుతో రూ.10 కోట్ల మోసం, ఇద్దరి అరెస్ట్

ఆదిలాబాద్: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి భారీగా నగదు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రెండేళ్లలోనే పెట్టుబడి రెట్టింపు అవుతుందని, అధిక లాభాలు గడించవచ్చని ఆశచూపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 500 మంది బాధితుల నుంచి ఏకంగా రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కీలక నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూమ్ మీటింగ్‌లు.. 25 శాతం కమీషన్ ఎర
దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు ‘ఐటీసీ గ్లోబల్’ పేరిట ఓ నకిలీ పెట్టుబడి పథకాన్ని తెరపైకి తెచ్చారు. ప్రజలను ఆకర్షించేందుకు రూ.1,000 నుంచి రూ.3 లక్షల వరకు పలు ప్యాకేజీలను రూపొందించారు. నగరాల్లోని ప్రముఖ హోటళ్లలో సమావేశాలు, ఆన్లైన్ జూమ్ మీటింగ్‌ల ద్వారా ఆకర్షణీయమైన ప్రెజెంటేషన్లు ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకున్నారు. పెట్టుబడిపై అధిక రాబడి ఇవ్వడంతో పాటు, కొత్త సభ్యులను చేర్పిస్తే ఏకంగా 25 శాతం రెఫరల్ కమీషన్ ఇస్తామని ఆశచూపి భారీ నెట్‌వర్క్‌ను విస్తరించారు.
లక్షల్లో నష్టపోయిన స్థానికులు
ఈ ముఠా వలలో పడి ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు బాధితులు లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ప్రధాన ఫిర్యాదుదారుడైన జువ్వక నర్సింలు అనే వ్యక్తి ఈ పథకాన్ని నమ్మి రూ.7.50 లక్షలు పెట్టుబడిగా పెట్టి మోసపోయినట్లు పోలీసులను ఆశ్రయించారు. అనంతరం మరికొందరు బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పోలీసుల హెచ్చరిక
తక్కువ సమయంలోనే పెట్టుబడులను రెట్టింపు చేస్తామని, సభ్యులను చేరిస్తే భారీ కమీషన్లు ఇస్తామని చెప్పే మోసపూరిత మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), క్రిప్టో పథకాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా సంస్థలో డబ్బులు పెట్టేముందు సెబీ (SEBI), ఆర్బీఐ (RBI) వంటి ప్రభుత్వ నియంత్రణ సంస్థల గుర్తింపు ఉందో లేదో సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
