చిన్నారి హత్య కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడాలి: ఎంపీ ఈటల రాజేందర్
వలస కార్మికులను నియమించుకునే ఏజెన్సీలకు బాధ్యత ఉండాలి.. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలి

మల్కాజిగిరి: కౌకూర్ గ్రామంలోని విల్లా ఆర్కేడ్ గేటెడ్ కమ్యూనిటీలో ఐదేళ్ల చిన్నారి అరేలియా (మోను) హత్యకు గురైన ఘటనపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చిన్నారిని హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు.
ఉపాధి కోసం వచ్చేవారి వివరాల ధృవీకరణ తప్పనిసరి
విల్లా ఆర్కేడ్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన బీహార్‌కు చెందిన వ్యక్తి చిన్నారిని కిడ్నాప్ చేసి, ఆమె తాతకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేసినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. డబ్బులు ఇస్తామని చెప్పినా చిన్నారిని హత్య చేసి నీటి ట్యాంకులో పడేయడం అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో గతంలోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు.
ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది హైదరాబాద్‌కు వస్తున్నారని, వారిని పనిలోకి తీసుకునే సమయంలో సరైన వివరాలు సేకరించడం, నేపథ్యాన్ని ధృవీకరించడం తప్పనిసరి కావాలని అన్నారు. కార్మికులను నియమించే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు కేవలం కమిషన్ తీసుకోవడానికే పరిమితం కాకుండా, వారి వివరాల ధృవీకరణతో పాటు బాధ్యతాయుతమైన పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లో మత్తు పదార్థాలు, మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వాటి సరఫరా వెనుక ఉన్న మూలాలను గుర్తించి కఠినంగా అరికట్టాలని అన్నారు.
మత్తు పదార్థాల ప్రభావంతో నేరాలకు పాల్పడే ఘటనలను అడ్డుకోవడానికి పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పెద్దపెద్ద ఫాంహౌస్‌లలో కూడా డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
నిందితుడికి త్వరితగతిన కఠిన శిక్ష పడాలి
తెలంగాణ పోలీసులు సమర్థవంతమైనవారని పేర్కొన్న ఎంపీ, ఈ కేసులో తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడికి చట్ట ప్రకారం త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని, భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలాంటి దుస్థితి రాకుండా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చింతల మాణిక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఆదిత్య, సీనియర్ నాయకులు సుదర్శన్, సామల సత్తిరెడ్డి, యశ్వంత్, రోషన్‌తో పాటు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
