సమస్యల నిలయంగా మైనార్టీ గురుకుల వసతి గృహం
విద్యార్థినుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 14 (Zindagi9news): సారపాకలోని మైనార్టీ బాలికల గురుకుల కళాశాల, వసతి గృహంలో అనేక సమస్యలు నెలకొన్నాయని గిరిజన విద్యార్థి సంఘం (జీవీఎస్), ఆర్ఎల్డీ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యంపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 13న నాయకులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వసతి గృహంలో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని, గత వారం ఎలుకలు కరిచి విద్యార్థినులు గాయపడినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పరిశీలన సమయంలోనే గదుల్లో నాలుగు పెద్ద ఎలుకలు సంచరించడాన్ని గమనించామని తెలిపారు.వసతి గృహ భవనం పాతబడటంతో పాటు సరైన గాలి, వెలుతురు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, అపరిశుభ్రత, ఆట స్థలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాన రహదారికి ఆనుకుని వసతి గృహం ఉండటంతో వాహనాల రాకపోకల శబ్దం కారణంగా విద్యార్థినులు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని తెలిపారు.విద్యార్థినుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత భవనం నుంచి వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయించి, అన్ని సౌకర్యాలు కలిగిన సురక్షితమైన భవనానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఎలుకల నివారణ చర్యలు చేపట్టి, వసతి గృహాన్ని పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని, ఎలుకల కాటుకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు జీవీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ బాలాజీ నాయక్, ఆర్ఎల్డీ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గూగులోతు పృధ్వీ నాయక్, జీవీఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బానోతు రాంబాబు నాయక్ తెలిపారు.వసతి గృహంలో నెలకొన్న సమస్యలపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థినుల భద్రతకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
