రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన డీఐఈఓ

సంగారెడ్డి: లంచం తీసుకుంటూ సంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DIEO) రామావత్ గోవింద్ రామ్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బుధవారం రోజున మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో సంగారెడ్డిలోని తన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం…వికాస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ ప్రొవిజనల్ అఫిలియేషన్ పొడిగింపు, రెన్యూవల్ కోసం తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించేందుకు డీఐఈఓ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. తొలుత రూ.50 వేల లంచం డిమాండ్ చేయగా, ఇప్పటికే రూ.30 వేలు తీసుకున్నట్లు పేర్కొంది. మిగిలిన రూ.20 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
డీఐఈఓ వద్ద నుంచి రూ.20 వేల లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విధులను సక్రమంగా నిర్వహించకుండా అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది.
అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
