ఇన్సర్వీస్ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అవకాశం
స్పెషల్ TGTETకు 24,986 మంది హాజరు.. నేటి నుంచి రెండు రోజుల పాటు పరీక్షలు

హైదరాబాద్, సెప్టెంబర్ 8: తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా స్పెషల్ TGTET–ఇన్ సర్వీస్ టీచర్స్–2026 పరీక్షలను సెప్టెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహిస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యాయులకు TET అర్హత తప్పనిసరి కావడంతో 2025 సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో సుమారు 66 వేల మంది ఉపాధ్యాయులు TETలో అర్హత సాధించాల్సి ఉంది. అనంతరం 2026 జనవరి, జూన్ నెలల్లో నిర్వహించిన రెండు సాధారణ TGTET పరీక్షల ద్వారా సుమారు 38 వేల మంది ఉపాధ్యాయులు అర్హత సాధించారు.
ఇంకా సుమారు 28 వేల మంది ఉపాధ్యాయులు TET అర్హత సాధించాల్సి ఉండటంతో, వారికి అవకాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు TGTET పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు 2026 జూలై 21న స్పెషల్ TGTET నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుత ప్రత్యేక TGTET పరీక్షకు మొత్తం 24,986 మంది ఇన్సర్వీస్ టీచర్లు హాజరుకానున్నారు. వీరిలో పేపర్–1కు 5,964 మంది, పేపర్–2కు 19,022 మంది అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాల్లో మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ ప్రత్యేక పరీక్ష ద్వారా అర్హత సాధించే ఇన్సర్వీస్ టీచర్లకు TET తప్పనిసరి నిబంధనను పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
