సెప్టెంబర్ 12న జాతీయ లోక్‌అదాలత్.. పరిష్కరించుకునే కేసులు ఇవే

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12, 2026న మూడో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) 2026 సంవత్సరానికి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ లోక్‌అదాలత్‌ను సెప్టెంబర్ రెండో శనివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలకు NALSA అధికారికంగా సమాచారం అందించింది.
లోక్‌అదాలత్‌లో ఏ కేసులు పరిష్కరిస్తారు?
జాతీయ లోక్‌అదాలత్‌లో పెండింగ్‌లో ఉన్న అర్హత కలిగిన సివిల్ కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను పరిష్కారానికి తీసుకోవచ్చు. కేసులను ముందుగానే గుర్తించి, ఇరుపక్షాల మధ్య రాజీ లేదా సెటిల్మెంట్కు అవకాశం కల్పించేందుకు ప్రీ-లోక్‌అదాలత్, ప్రీ-కన్సిలియేషన్ సమావేశాలు నిర్వహించాలని NALSA సూచించింది.
చెక్ బౌన్స్ కేసులకు కూడా అవకాశం
NI Act సెక్షన్ 138 కింద చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ కేసులు, రాజీ చేసుకోదగిన ట్రాఫిక్ చలాన్లు, కార్మిక వివాదాలు వంటి కేసులను జాతీయ లోక్‌అదాలత్‌లో పరిష్కారానికి తీసుకోవచ్చు.
అదేవిధంగా విద్యుత్, నీటి బిల్లుల వివాదాలు, కుటుంబ, వైవాహిక వివాదాలు (విడాకులు మినహా), భూసేకరణ కేసులు, పెన్షన్ సహా సర్వీస్ మ్యాటర్స్, రెవెన్యూ వివాదాలు, వినియోగదారుల వివాదాలు, ఇతర సివిల్ కేసులు కూడా పరిష్కారానికి తీసుకోవచ్చు.
2026లో నాలుగు జాతీయ లోక్‌అదాలత్‌లు
NALSA షెడ్యూల్ ప్రకారం 2026లో నాలుగు జాతీయ లోక్‌అదాలత్‌లు నిర్వహించనున్నారు. మార్చి 14న మొదటి, మే 9న రెండో లోక్‌అదాలత్ నిర్వహించగా.. సెప్టెంబర్ 12న మూడో, డిసెంబర్ 12న నాలుగో జాతీయ లోక్‌అదాలత్ నిర్వహించనున్నారు.
ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక దృష్టి
ప్రీ-లిటిగేషన్ కేసుల నమోదును పెంచడంతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నోటీసులు అందించే విధానాన్ని ప్రోత్సహించాలని NALSA సూచించింది. లోక్‌అదాలత్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, పరిష్కరించిన కేసుల వివరాలను నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (NJDG)లో సకాలంలో నమోదు చేయాలని కూడా సూచించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
