16 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

హైదరాబాద్, ఆగస్టు 31: మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసులో నిందితుడికి రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నిందితుడు సయ్యద్ ముకర్రం (26)కు రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
పోలీసుల కథనం ప్రకారం.. 2023 డిసెంబర్ 16న 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లి డిసెంబర్ 18న పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాలికను గుర్తించారు.
వివాహం చేసుకుంటానని నమ్మించి తన ఇంటికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు తెలిపినట్లు సమాచారం. దర్యాప్తు అనంతరం పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 376(2)(n), 366తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 5(l), 6 కింద చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసును విచారించిన ఎల్బీనగర్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో సయ్యద్ ముకర్రంకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
