రాష్ట్రవ్యాప్తంగా నేటి అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్ల సమ్మె

హైదరాబాద్, ఆగస్టు 23 (జిందగీ9న్యూస్): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు, ప్రైవేట్ క్యాబ్‌లు, స్కూల్ వ్యాన్ల డ్రైవర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యారు. జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) పిలుపు మేరకు ఆగస్టు 23 అర్ధరాత్రి నుంచి ఆటోలు, స్కూల్ వ్యాన్లు, ప్రైవేట్ క్యాబ్‌ల సేవలను నిలిపివేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి.
రవాణా రంగానికి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుతో ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.
సమ్మెకు CITU, TNTUC, TUC తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించినట్లు నాయకులు తెలిపారు. సమ్మె కారణంగా సోమవారం నుంచి పాఠశాల విద్యార్థులు, ఆటోలు, క్యాబ్‌లపై ఆధారపడే ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందస్తుగా ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని సంఘాల నాయకులు సూచించారు.
