8 ఆసుపత్రులు నిరాకరించిన ఆపరేషన్..
జమ్మికుంటలో అరుదైన హైడాటిడ్ సిస్ట్ శస్త్రచికిత్స విజయవంతం
ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో క్లిష్టమైన ఆపరేషన్

జమ్మికుంట, ఆగస్టు 23 (జిందగీ9న్యూస్): జమ్మికుంటలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అరుదైన, క్లిష్టమైన హైడాటిడ్ సిస్ట్ శస్త్రచికిత్స విజయవంతమైంది. జనరల్ సర్జన్ డాక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.
సిరిసేడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతు 16 ఏళ్ల క్రితం కాలేయంలోని హైడాటిడ్ సిస్ట్ల తొలగింపునకు లాపరోటమీ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వ్యాధి కాలేయంతో పాటు పొత్తికడుపులోని పెరిటోనియం ప్రాంతానికి కూడా విస్తరించింది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో సుమారు ఎనిమిది ఆసుపత్రులు శస్త్రచికిత్సకు నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అనంతరం ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆశ్రయించగా, డాక్టర్ మహిపాల్ పరీక్షలు నిర్వహించి కాలేయంలో సుమారు 12 హైడాటిడ్ పరాన్నజీవి తిత్తులు ఉన్నట్లు గుర్తించారు. అవసరమైన పరీక్షల అనంతరం ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ ద్వారా శస్త్రచికిత్స నిర్వహించారు. కాలేయం, పొత్తికడుపు ప్రాంతంలోని తిత్తులను వాటి గోడలతో సహా జాగ్రత్తగా తొలగించారు. పరాన్నజీవులు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రత్యేక స్కోలిసైడల్ ఏజెంట్‌ను ఉపయోగించినట్లు వైద్యులు తెలిపారు.
క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ మహిపాల్, ఆసుపత్రి యాజమాన్యానికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
