రిజర్వేషన్లను ప్రశ్నించే ముందు అసమానతలను ప్రశ్నించాలి: శంకర్ మాదిగ

జమ్మికుంట, ఆగస్టు 23 (జిందగీ9న్యూస్): రిజర్వేషన్లను తొలగించాలని డిమాండ్ చేసే ముందు దేశంలో కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక అసమానతలను తొలగించేందుకు కృషి చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ అన్నారు. ఆదివారం జమ్మికుంటలో నిర్వహించిన జిల్లా సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇటీవల జరిగిన రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలపై ఆయన స్పందిస్తూ.. రిజర్వేషన్లు ఎవరి దయతో వచ్చినవి కావని, రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. కుల వివక్ష పూర్తిగా తొలగకముందే రిజర్వేషన్లను రద్దు చేయాలని కోరడం సామాజిక న్యాయాన్ని తిరస్కరించడమేనన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల హక్కులకు భంగం కలిగించే ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలని, సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
దళితుల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఎంతమేరకు లబ్ధిదారులకు చేరుతున్నాయో ప్రజలకు వివరించాలని శంకర్ మాదిగ డిమాండ్ చేశారు. తెలంగాణలో దళిత యువతకు ఎన్ని సబ్సిడీ రుణాలు ఇచ్చారు, ఎంతమందికి స్వయం ఉపాధి కల్పించారు, ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి, ఎంత నిధులు విడుదలయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని కోరారు. చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్ల పరిరక్షణతో పాటు దళితుల హక్కులు, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత కోసం మాదిగ హక్కుల దండోరా నిరంతరం పోరాడుతుందని శంకర్ మాదిగ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల కుమారస్వామి మాదిగ, రాష్ట్ర నాయకులు వడ్డేపల్లి శ్రీనివాస్ మాదిగ, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డే రాజేందర్ ప్రసాద్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
