జమ్మికుంట వారసంత (అంగడి) తరలింపు.. ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

జమ్మికుంట, ఆగస్టు 23 (Zindagi9news): జమ్మికుంట పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంత (అంగడి)ను కొండూరి కాంప్లెక్స్ నుంచి పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డుకు మార్చే ఏర్పాట్లను ఆదివారం మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్‌కుమార్ (దిలీప్) పరిశీలించారు. కొండూరి కాంప్లెక్స్ పరిసరాల్లో వారసంత నిర్వహణతో పాఠశాలలు, ఆసుపత్రులు, బొమ్మలగుడి ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చైర్మన్ తెలిపారు. వర్షాల సమయంలో ఆయా ప్రాంతాలు బురదమయంగా మారుతున్న నేపథ్యంలో అంగడిని కొత్త ప్రాంతానికి తరలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాత వ్యవసాయ మార్కెట్ రోడ్డు నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు లైటింగ్, పారిశుధ్య ఏర్పాట్లు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులు చేపట్టినట్లు వివరించారు. వారసంతను కొత్త ప్రాంతంలో నిర్వహించేందుకు పట్టణ ప్రజలు, వ్యాపారులు, పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలని చైర్మన్ కోరారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్, బోళ్ల సదానందం, కొలుగూరి కిరణ్, మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.
