నకిలీ సర్టిఫికెట్లతో POCSO కేసులు పెట్టొద్దు: అలహాబాద్ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్, ఆగస్టు 22: బాధితురాలి వయస్సును 18 ఏళ్లలోపు చూపించేందుకు నకిలీ స్కూల్ సర్టిఫికెట్లు సమర్పించి POCSO చట్టం కింద కేసులు నమోదు చేస్తున్న ఘటనలపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి ఘటనలు POCSO చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని కోర్టు అభిప్రాయపడింది.బాధితురాలి తల్లిదండ్రులు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేదా హెడ్మాస్టర్ లేఖ వంటి నకిలీ పాఠశాల పత్రాలను సమర్పించి ఆమె వయస్సును 18 ఏళ్లలోపు చూపించిన కేసులు తమ దృష్టికి వచ్చినట్లు కోర్టు పేర్కొంది. కొన్ని సందర్భాల్లో బాధితురాలే నిందితుడితో ప్రేమ సంబంధంలో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పటికీ, యువకుడిని శిక్షించేందుకు POCSO చట్టాన్ని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించింది.పాఠశాలల నుంచి వయస్సు ధ్రువీకరణ పత్రాల జారీకి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, సంబంధిత కేసులో పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు మెరిట్స్‌పై ఎలాంటి తుది అభిప్రాయం వ్యక్తం చేయలేదని స్పష్టం చేసింది.
