119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తులు

హైదరాబాద్, ఆగస్టు 13 (జిందగి9న్యూస్): బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు కాగా, లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీపై ఉచితంగా అందజేయనున్నారు.
ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు
ఈ పథకం కోసం అర్హులైన బీసీ మహిళల నుంచి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, 2026 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వీరికి ప్రాధాన్యత
అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని చెప్పారు.
కుట్టు మిషన్లను సక్రమంగా వినియోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కూడా అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
తొలి దశలో 1.19 లక్షల మందికి అవకాశం
కుట్టు మిషన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, తొలి దశలో 1.19 లక్షల మంది అర్హులైన బీసీ మహిళలకు ప్రయోజనం కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇంటి నుంచే కుట్టు వృత్తి ద్వారా ఆదాయం పొందేలా బీసీ మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
పథకం ప్రారంభ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.

Samudrala village
Koheda mandal
Siddipet distik