భూమి సర్వే, పట్టాదార్ పాస్‌బుక్ కోసం రూ.50 వేలు డిమాండ్.. బీర్పూర్లో ఏసీబీ ట్రాప్

జగిత్యాల, ఆగస్టు 13 (జిందగి9న్యూస్): జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాంచికట్ల రాహుల్ రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గురువారం కరీంనగర్ ఏసీబీ యూనిట్ అధికారులు ఈ ట్రాప్ నిర్వహించారు.
ఫిర్యాదుదారుడి భూమికి ఫీల్డ్ సర్వే నిర్వహించి, రిజిస్ట్రేషన్‌తో పాటు పట్టాదార్ పాస్‌బుక్ జారీకి నివేదిక ఇవ్వడానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ తొలుత రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించగా, అందులో రూ.30 వేలు ఆగస్టు 13న, మిగిలిన రూ.10 వేలు పని పూర్తయిన తర్వాత చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
ఈ క్రమంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.30 వేలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ తెలిపింది.
