వర్షాలు సమృద్ధిగా కురవాలని మహా వరుణయాగం.. నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల పూర్ణాహుతి
108 మంది రుత్వికులు.. 11 హోమగుండాలతో వైదిక క్రతువులు | కృష్ణా–గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధి వర్షాల కోసం ప్రార్థనలు

నాగార్జునసాగర్, ఆగస్టు 10 (జిందగి9న్యూస్): తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ముగిసింది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులతో 11 హోమగుండాలు ఏర్పాటు చేసి వరుణదేవుని అనుగ్రహం కోసం వైదిక విధానంలో హోమక్రతువులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు.
రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు నిండాలని, ప్రతి చెరువు, కుంట జలకళతో కళకళలాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. భూగర్భ జలాలు పెరిగి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలని, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వరుణదేవుడిని ప్రార్థించారు.
వర్షాలు, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం మధ్య ఉన్న సంబంధాన్ని ప్రతిబింబించే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ యాగాన్ని నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికల ఆధారంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపింది.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, పి. సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
