భూ వివాదం విషాదం.. కుమార్తెతో ఘర్షణ అనంతరం మహిళ ఆత్మహత్య

ఇల్లందకుంట, జూలై 28 (Zindagi9News): కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మల్యాల గ్రామంలో భూ వివాదం విషాదానికి దారితీసింది. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్యాల గ్రామానికి చెందిన చందగల్ల శంకరయ్య తన చిన్న కుమార్తె రామంచ శైలజ తో భూ వివాదం నెలకొన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శైలజ తన తల్లి చందగల్ల లక్ష్మి (60)పై దాడి చేసి, ఇంటి బయటకు ఈడ్చుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను హుజూరాబాద్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఆమె మృతి చెందింది.
మృతురాలి భర్త చందగల్ల శంకరయ్య ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ కొనసాగుతోంది.
