500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల తుది ఫలితాలు విడుదల
జనరల్ సర్జరీ, మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ పోస్టులకు ఎంపిక జాబితా
1,616 పోస్టుల్లో ఇప్పటికే 1,192 భర్తీ పూర్తి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, జూలై 28 (Zindagi9News): తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం మొత్తం 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల తుది ఫలితాలను విడుదల చేసింది.
విడుదలైన ఫలితాల్లో జనరల్ సర్జరీ – 174, జనరల్ మెడిసిన్ – 166, ఆర్థోపెడిక్స్ – 89, రేడియాలజీ – 71 పోస్టులు ఉన్నాయి. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్ఎస్ఆర్బీ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాలకు చెందిన 692 పోస్టుల భర్తీ పూర్తై, ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు.
తాజా ఫలితాలతో కలిపి ఇప్పటివరకు 1,192 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఎంపికైన డాక్టర్లకు అభినందనలు తెలియజేసిన ఆయన, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను ఆదేశించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
