కలిసిపోయిన బండి–ఈటల.. బీజేపీలో సయోధ్యకు శ్రీకారం?
లక్ష్మణ్ నివాసంలో అభయ్ పాటిల్ సమక్షంలో భేటీ.. ఆలింగనం చేసుకున్న ఇద్దరు నేతలు

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య నెలకొన్న విభేదాలకు ముగింపు పలికే దిశగా పార్టీ పెద్దలు చొరవ తీసుకున్నారు. సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అభయ్ పాటిల్ సమక్షంలో బండి సంజయ్, ఈటల రాజేందర్‌తో అంతర్గత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అభయ్ పాటిల్ కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. చర్చల అనంతరం బండి సంజయ్, ఈటల రాజేందర్ నవ్వుతూ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయనకు, బండి సంజయ్‌కు మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింత ముదురుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
ఈ భేటీతో ఇద్దరు నేతల మధ్య నెలకొన్న విభేదాలకు పూర్తిగా తెరపడుతుందా? లేక ఇది తాత్కాలిక సయోధ్యగానే మిగిలిపోతుందా? అనే అంశంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
