రూ.500 కోసం గొడవ.. తండ్రి, కుమారుడిపై దాడి చేసిన యువకుడిపై కేసు

జమ్మికుంట, జూన్ 29(Zindagi9news): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంటలో రూ.500 కూలీ బకాయి డబ్బుల విషయంలో జరిగిన గొడవ దాడికి దారితీసింది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆబాది జమ్మికుంటకు చెందిన పోడేటి మొగిలి (56) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 27న చెవుల వంశీ అనే వ్యక్తి పెయింటింగ్ పనుల కోసం ఇద్దరు కార్మికులను పంపించి, ఒక్కొక్కరికి రూ.1,000 చొప్పున మొత్తం రూ.2,000 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. పని పూర్తయిన అనంతరం రూ.1,500ను ఫోన్‌పే ద్వారా చెల్లించి, మిగిలిన రూ.500ను మరుసటి రోజు ఇస్తానని తెలిపాడు.
అయితే, జూన్ 28 ఉదయం వంశీ ఫోన్ చేసి మిగిలిన డబ్బులు కోరగా, రాత్రి వరకు చెల్లిస్తానని పోడేటి మొగిలి తెలిపాడు. అదే రోజు సాయంత్రం మళ్లీ ఫోన్ చేసిన వంశీకి రాత్రి 7 గంటల వరకు ఇస్తానని చెప్పినా వినకుండా సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో మొగిలి ఇంటికి వెళ్లి అసభ్య పదజాలంతో దూషిస్తూ అతనిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సమయంలో మొగిలి కుమారుడు పోడేటి రాకేష్ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తుండగా, చెవుల వంశీ పక్కనే ఉన్న సిమెంట్ ఇసుక తీసుకొని రాకేష్ తలపై కొట్టడంతో అతడికి రక్తగాయం అయింది. గొడవను అడ్డుకునేందుకు వచ్చిన దిగుళ్ల రాజు, చందు, మైస మొగిలిలను కూడా వంశీ దూషించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణలో వెల్లడికానున్నాయి.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
