ఎలాంటి ఆటంకాలు వచ్చినా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండ, జూన్ 28 (జిందగీ9న్యూస్): ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మూసీ నది ప్రక్షాళనను పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించిన అనంతరం, నల్గొండ పట్టణంలో తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TUFIDC) ఆధ్వర్యంలో రూ.83 కోట్ల వ్యయంతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
“మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది నా కల. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా. ఎవరు అడ్డుకున్నా వెనక్కి తగ్గేది లేదు. మూసీ కాలుష్యంతో ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి విముక్తి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం” అని ముఖ్యమంత్రి అన్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు అందిస్తామని ప్రకటించారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేయడానికీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ప్రజాప్రతినిధులు కోరిన ప్రతి అభివృద్ధి పనిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధమని పేర్కొన్న సీఎం, గత పదేళ్లలో రాష్ట్రంలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు జారీ చేసిందని, రాష్ట్రంలోని 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు.
రైతుల సంక్షేమానికి 30 నెలల్లో రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు కులగణన నిర్వహించామని చెప్పారు. 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించామని, దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత భారీ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యను అందుబాటులోకి తీసుకువచ్చామని, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు. స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేసి యువతకు నైపుణ్యాధారిత విద్య అందిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
