అంకుశాపూర్ సమీపంలో వ్యక్తి దారుణ హత్య.. పాత కక్షలే కారణమా?

జమ్మికుంట, జూన్ 28(Zindagi9news) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు రోడ్డుపై అనుమానాస్పద స్థితిలో మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి, మృతుడిని అంకుశాపూర్ గ్రామానికి చెందిన పైతారి మొగిలిగా గుర్తించారు.స్థానికుల కథనం ప్రకారం, పాత కక్షల నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో ఈ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంకుశాపూర్–జమ్మికుంట ప్రధాన రహదారిపై జరిగిన ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు పాల్పడిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
