సస్పెండ్ తహసీల్దార్‌పై అక్రమాస్తుల కేసు
ఏసీబీ సోదాల్లో రూ.5.05 కోట్ల ఆస్తుల గుర్తింపు

హైదరాబాద్, జూన్ 25(Zindagi9news): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా షామీర్పేట్ మండలానికి చెందిన సస్పెండ్ అయిన తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వెల్లడించింది. తెలిసిన ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆమె నివాసంతో పాటు బంధువులు, బినామీలకు చెందిన మరో మూడు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సిద్ధిపేట జిల్లా మార్కూక్ మండలం దామరకుంట గ్రామంలో 2 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లో మూడు ఫ్లాట్లు, కీసర, ఖానామేట్ ప్రాంతాల్లో రెండు ప్లాట్లు గుర్తించారు. అలాగే రూ.12 లక్షల నగదు, రెండు కార్లు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు, రూ.38 లక్షల బ్యాంకు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో గుర్తించిన ఆస్తుల మొత్తం విలువ రూ.5,05,52,465గా ఏసీబీ అంచనా వేసింది. స్థిరాస్తుల మార్కెట్ విలువ పత్రాల విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. అదనపు ఆస్తులపై విచారణ కొనసాగుతోందని, కేసు దర్యాప్తు దశలో ఉందని వెల్లడించింది. గతంలో లంచం కేసులో అరెస్టైన సుచరిత ప్రస్తుతం న్యాయస్థాన కస్టడీలో ఉన్నట్లు ఏసీబీ పేర్కొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
