పెద్దపల్లి జిల్లాకు మరో ఘనత.. బాల్య వివాహాల రహిత జిల్లాగా కలెక్టర్ ప్రకటన

పెద్దపల్లి, మే 30(Zindagi9news): పెద్దపల్లి జిల్లాను బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడించారు. మహిళా సాధికారత, బాలికల రక్షణ, అక్షరాస్యత పెంపు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతున్నాయని తెలిపారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్నేహ కిశోర బాలికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రజలతో చర్చించి వారి సూచనలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే విధానాలే దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయని పేర్కొన్నారు. మాక్ పార్లమెంట్లో పాల్గొన్న విద్యార్థులు, మహిళలు తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయాలని సూచించారు.
జిల్లాలోని మహిళా సంఘాల్లో అక్షరాస్యత లేని మహిళలను ఉల్లాస్ కార్యక్రమం కింద గుర్తించి, ఐదు వేల మంది వాలంటీర్ల సహకారంతో వారికి విద్యాబోధన అందించినట్లు తెలిపారు. మార్చి నెలలో నిర్వహించిన అక్షరాస్యత పరీక్షల్లో 34,620 మంది మహిళలు పాల్గొని వంద శాతం ఉత్తీర్ణత సాధించడం జిల్లాకు గర్వకారణమని అన్నారు. మిగిలిన 35 వేల మంది మహిళలకు జూలై నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అనంతరం జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, 14 మండలాల పరిధిలోని 263 గ్రామ పంచాయతీల్లో బాల్య వివాహాలు జరగడం లేదని ధృవీకరిస్తూ పెద్దపల్లి జిల్లాను అధికారికంగా బాల్య వివాహాల రహిత జిల్లాగా ప్రకటించారు.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వేధింపులు, వివక్షను పూర్తిగా నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహిళల భద్రత, గౌరవ పరిరక్షణ కోసం కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళీందిని, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, సంబంధిత శాఖల అధికారులు, స్నేహ కిశోర బాలికల సంఘం సభ్యులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
