భాష ఏదైనా.. ఫిర్యాదు ఇక సులభం: హైదరాబాద్ పోలీసుల ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్ ప్రారంభం

హైదరాబాద్, మే 23: పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ మరో వినూత్న అడుగు వేసింది. భాషా పరమైన ఇబ్బందుల కారణంగా ఫిర్యాదుల నమోదులో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘ఏఐ కాప్‌రైటర్’ పేరుతో కృత్రిమ మేధ (AI) ఆధారిత బహుభాషా ఫిర్యాదుల నమోదు యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
శనివారం బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీలో జరిగిన కార్యక్రమంలో ఈ యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం యాప్ పనితీరును పరిశీలించారు.
హైదరాబాద్ నగరంలోని 80కి పైగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులోకి రానున్న ఈ యాప్ ద్వారా బాధితులు తమ మాతృభాషలో చెప్పే ఫిర్యాదులను పోలీసులు వెంటనే రికార్డు చేసి, అవసరమైన భాషలోకి అనువదించుకోగలరు. ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్ రాని ఇతర రాష్ట్రాల వలస కార్మికులు, పర్యాటకులు ఫిర్యాదు చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఇది పరిష్కారంగా నిలవనుంది.
ఈ యాప్ 10కి పైగా ప్రధాన భారతీయ భాషలను గుర్తించే సామర్థ్యంతో రూపొందించబడింది. బాధితుడు మాట్లాడిన సమాచారాన్ని కేవలం కొన్ని సెకన్లలోనే రాతపూర్వక రూపంలోకి మార్చి, పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. ఫిర్యాదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు అనువాదకుల కోసం వేచి ఉండాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది.
అదేవిధంగా, ఫిర్యాదు రికార్డ్ చేసిన అధికారి వివరాలు, సమయం వంటి సమాచారం ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ రూపంలో భద్రపరచబడుతుంది. దీనివల్ల రికార్డులలో మార్పులు చేసే అవకాశం తగ్గి పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు. బాధితుడు, నిందితుడు, సాక్షులు మాట్లాడే సమాచారాన్ని వేర్వేరుగా గుర్తించి నమోదు చేసే ప్రత్యేక ఫీచర్ కూడా ఈ యాప్‌లో ఉంది.
ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ, “హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీ కావడంతో ఇతర రాష్ట్రాల ప్రజలు, విదేశీయులు పెద్ద సంఖ్యలో ఉంటారు. భాష తెలియక ఫిర్యాదులు నమోదు చేయడంలో జాప్యం, సమాచారం తప్పుగా నమోదు కావడం వంటి సమస్యలకు ఈ యాప్ చెక్ పెట్టనుంది. బాధితుడు తన మాతృభాషలో మాట్లాడితే, యాప్ దానిని వెంటనే గుర్తించి అధికారిక రికార్డుగా మారుస్తుంది” అని తెలిపారు.
ఈ వినూత్న యాప్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్, సంస్థ సహకారంతో రూపొందించింది.
ఇక ఇప్పటికే సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ‘సి-మిత్ర’, సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులను గుర్తించేందుకు ‘సాక్-ఐ’ వంటి ఏఐ ఆధారిత వ్యవస్థలను కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ వినియోగిస్తోందని అధికారులు వెల్లడించారు. తాజా ‘ఏఐ కాప్‌రైటర్’ యాప్‌తో ఫిర్యాదుల నమోదు ప్రక్రియ మరింత వేగవంతం, క్రమబద్ధంగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
