జమ్మికుంట పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం.. ఎడ్ల వ్యాపారులపై దాడి, రూ.38 వేల దోపిడీ
11 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కేసు.. స్థానికుల్లో భయాందోళన

జమ్మికుంట, మే 21 (Zindagi9News):
జమ్మికుంట పట్టణంలో ఎడ్లను కొనుగోలు చేసి ఆటో ట్రాలీలో తీసుకువస్తున్న ఇద్దరిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగదు, బంగారు ఉంగరం, ఫోన్‌పే ద్వారా డబ్బులు లాక్కున్న ఘటన సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ ఘటన జమ్మికుంట పోలీస్ స్టేషన్ సమీపంలోనే చోటుచేసుకోవడం స్థానికుల్లో భయాందోళనకు గురిచేస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం, నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం తూర్పాయగూడెం గ్రామానికి చెందిన రైతు నల్లమల్ల ఆంజనేయులు (45), మే 20న ఆవుల రాములు ఆటో ట్రాలీ (TS 08 UD 5457)ను కిరాయికి తీసుకుని పెద్దపల్లి జిల్లాలోని పోత్కపల్లి గ్రామానికి వెళ్లి వంగ సదానందం వద్ద మూడు ఎడ్లను కొనుగోలు చేశారు. అనంతరం రాత్రి సమయంలో ఎడ్లను ఆటో ట్రాలీలో తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
రాత్రి సుమారు 12:30 గంటల సమయంలో జమ్మికుంట పట్టణంలోని అమరవీరుల స్థూపం (పాత మున్సిపల్ ఆఫీస్ ) సమీపంలో ఆటో ట్రాలీని కొంతమంది అడ్డగించి, “దొంగతనంగా ఎడ్లను తీసుకువస్తున్నారా” అంటూ ఫిర్యాదిదారుడు మరియు డ్రైవర్‌ను కిందికి దింపి చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం వారిని FCI గోదాం ఎదుట ఉన్న మేకల మార్కెట్ వద్దకు తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడి, ఫిర్యాదిదారుడి వద్ద నుంచి రూ.8 వేల నగదు, ఫోన్‌పే ద్వారా రూ.3 వేలు బలవంతంగా పంపించుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయన చేతికి ఉన్న అర తులం బంగారు ఉంగరం (విలువ సుమారు రూ.20 వేలు) కూడా లాక్కున్నట్లు ఆరోపించారు.
ఇక డ్రైవర్ అయిన ఆవుల రాములను కొట్టి, అతని వద్ద నుంచి రూ.1,000 నగదు, ఫోన్‌పే ద్వారా మరో రూ.6 వేలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఇంకా రూ.1 లక్ష ఇవ్వాలని బెదిరిస్తూ ఉదయం 3:30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్తుండగా, బాధితులు అరిచి సహాయం కోరడంతో స్థానికులు అక్కడికి చేరుకుంటున్నట్లు గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.
ఈ ఘటనలో మొత్తం సుమారు రూ.38 వేల విలువైన నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేయగా, సుమారు 11 మంది గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళల్లో భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసు పహారా మరింత పెంచాలని కోరుతున్నారు. “పోలీస్ స్టేషన్ దగ్గరే ఇలాంటి ఘటనలు జరిగితే ప్రజల భద్రత ఎలా?” అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
