బౌంపల్లి పీఎస్‌లో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై, కానిస్టేబుల్

హైదరాబాద్, మే 20 (Zindagi9News):
తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని బౌంపల్లి పోలీస్ స్టేషన్లో లంచం తీసుకుంటూ ఓ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, బౌంపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎం. కిరణ్ నందిత మరియు పోలీస్ కానిస్టేబుల్ బి. విజయ్ కుమార్ ఒక కేసులో బాధితుడికి ఉన్న బెయిల్ షరతులను సడలించడంతో పాటు, కేసు పూర్తయ్యే వరకు సహకరిస్తామంటూ లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే కానిస్టేబుల్ రూ.10,000 లంచం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం మరో రూ.30,000 డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు మే 20న మధ్యాహ్నం సుమారు 4 గంటల సమయంలో ఏసీబీ అధికారులు వల పన్ని, లంచం తీసుకుంటుండగా ఎస్సై, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు స్వీకరించిన రూ.30,000 నగదును ఎస్సై ఎం. కిరణ్ నందితకు చెందిన యాక్టివా వాహనం డిక్కీలో దాచిపెట్టినట్లు గుర్తించిన అధికారులు, ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
