
జమ్మికుంట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మహిళ మృతి
జమ్మికుంట: జమ్మికుంట రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ రైల్వే పోలీసుల (జీఆర్పీ) వివరాల ప్రకారం.. ఈ నెల 9న జమ్మికుంట రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద సుమారు 25-30 సంవత్సరాల వయస్సు గల మహిళ స్పృహ తప్పి పడిఉండగా, డ్యూటీలో ఉన్న చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ గమనించారు.
వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి మహిళను జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేయగా, అక్కడ చికిత్స పొందుతూ మే 10న మృతి చెందింది.
మృతురాలు బ్లూ కలర్ డిజైన్ గల హాఫ్ ప్యాంట్, పింక్, బ్లూ, పసుపు రంగుల డిజైన్ గల టాప్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళతో పాటు సుమారు నాలుగేళ్ల బాలుడు ఉండగా, అతడిని చైల్డ్ హోమ్‌కు తరలించినట్లు సమాచారం. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా వస్తువులు లభించలేదు.
ప్రస్తుతం మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఈ కేసును జి. తిరుపతి, ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్, రామగుండం దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు 9949304574, 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని జీఆర్పీ అధికారులు కోరారు.
