
టేకుమట్లలో గంజాయి కేసు: ఇద్దరు నిందితుల అరెస్ట్
టేకుమట్ల, ఏప్రిల్ 17 (zindagi9news):
జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.పోలీసుల సమాచారం మేరకు, కుందనపల్లి గ్రామానికి చెందిన మాడుగుల ఉదయ్ కుమార్ (33) తన ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం అందడంతో టేకుమట్ల ఎస్ఐ అమూల్య సిబ్బందితో కలిసి అతని ఇంటిపై దాడి నిర్వహించారు. ఆ సమయంలో అతడు మొక్కలకు నీరు పోస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
విచారణలో ఉదయ్ కుమార్‌కు గంజాయి సేవించే అలవాటు ఉందని, వావిలాల గ్రామానికి చెందిన ఐలాపురం రాహుల్ తరచుగా గంజాయి విక్రయిస్తాడని వెల్లడించాడు. దీనితో పోలీసులు రాహుల్‌ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, అతని వద్ద రెండు ఎండు గంజాయి పొట్లాలు లభించాయి. వాటి బరువు సుమారు 13 గ్రాములు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు గంజాయి మొక్కలు (లైవ్ ప్లాంట్స్) మరియు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు చిట్యాల సీఐ డి. మల్లేశ్ వెల్లడించారు.
ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబర్చిన టేకుమట్ల ఎస్ఐ అమూల్యతో పాటు సిబ్బంది వెంకటేష్, హారిశ్లను డీఎస్పీ ఏ. సంపత్ రావు మరియు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
