తెలంగాణ-ఆంధ్ర విభజనను ఇండియా-పాకిస్తాన్తో పోల్చిన తేజస్వి సూర్య.. వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) మరియు మహిళా రిజర్వేషన్ల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పార్లమెంట్లో మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ విభజన అత్యంత అశాస్త్రీయంగా జరిగిందని ఆయన విమర్శించారు. భారత్-పాకిస్థాన్ విభజన కంటే కూడా దారుణంగా ఏపీని విభజించారని, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. విభజన సమయంలో తెలుగు ప్రజల భావోద్వేగాలు, ఆర్థిక వనరులు సరైన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ‘హైబ్రిడ్ మోడల్’ (50:50 ఫార్ములా)పై కూడా తేజస్వి సూర్య విమర్శలు గుప్పించారు. ఆదాయం లేదా జీడీపీ ఆధారంగా ఓటు హక్కులు లేదా సీట్ల కేటాయింపు చేయడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. “ఆదాయం ప్రకారం ఓట్లు ఇవ్వాల్సి వస్తే, దేశంలో అత్యధిక పన్నులు చెల్లించే అంబానీకి లక్ష ఓట్లు ఇవ్వాల్సి వస్తుంది.. ఇది సాధ్యమేనా?” అంటూ ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాలపై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. దక్షిణాది ప్రజలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు లేదా జనాభా నియంత్రణలో ముందున్న చిన్న రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వదని స్పష్టం చేశారు. గర్వించదగ్గ కన్నడిగుడిగా తానే ముందుండి అన్యాయాన్ని వ్యతిరేకిస్తానని తెలిపారు.
లోక్సభలో నియోజకవర్గాల పునర్విభజనపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల తగ్గింపు జరుగుతుందనే ఆందోళనల మధ్య తేజస్వి సూర్య చేసిన ఈ వ్యాఖ్యలు మరింత రాజకీయ వేడి పెంచాయి. విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ, రాజ్యాంగం నిర్దేశించిన ‘ఒకరికి ఒకే ఓటు’ సూత్రాన్ని ఆయన సమర్థించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
