పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మోసం… యువతి నుంచి రూ.60 వేల వసూలు

జమ్మికుంట, ఏప్రిల్ 10 (Zindagi9News): కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మండలం కోరపల్లి (కాపులపల్లి) గ్రామానికి చెందిన ఓ యువతి ఆన్లైన్ మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ప్రకారం… మార్చి 10 న మధ్యాహ్న సమయంలో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం చూస్తుండగా, ఒక పేజీ ద్వారా టాస్క్ ఆధారిత జాబ్ ఆఫర్ వచ్చింది. రివ్యూలు ఎంటర్ చేసి పోస్టు చేస్తే ఒక్క టాస్క్‌కు రూ.200 ఇస్తామని చెప్పడంతో ఆమె అంగీకరించింది. అనంతరం ఆమెను టెలిగ్రామ్ గ్రూపులో యాడ్ చేశారు.
మొదట ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసిన తర్వాత, మార్చి 11న మధ్యాహ్నం సుమారు 3:46 గంటలకు రూ.20,000 చెల్లించాలని చెప్పారు. అది కూడా టాస్క్‌లో భాగమేనని, తర్వాత మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు. దీంతో బాధితురాలు ఫోన్‌పే ద్వారా రూ.20,000 పంపింది.
అంతటితో ఆగకుండా మళ్లీ రూ.40,000 చెల్లించాలని ఒత్తిడి చేయడంతో, బాధితురాలు మరోసారి డబ్బు పంపింది. అనంతరం ఆమె కోసం సృష్టించిన అకౌంట్ ఫ్రీజ్ అయిందని, దాన్ని యాక్టివ్ చేయాలంటే రూ.70,000 చెల్లించాలని కోరారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితురాలు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజలు ఆన్లైన్లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మి డబ్బులు చెల్లించవద్దని సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
