కరీంనగర్లో విషాదం.. కవల కుమార్తెలను బావిలో తోసిన తండ్రి
కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 4(Zindagi9News):
కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తండ్రి తన నాలుగేళ్ల కవల కుమార్తెలను బావిలో తోసిన ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీనగర్ గ్రామానికి చెందిన కచ్చు శ్రీశైలంకు ఆరు సంవత్సరాల క్రితం మానకొండూరు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మౌనికతో వివాహమైంది. వీరికి గీతాంశీ, గీతాన్విక (4) అనే కవల కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య కుటుంబ సమస్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.
శుక్రవారం సాయంత్రం శ్రీశైలం తన ఇద్దరు కుమార్తెలను పొలానికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో గాలింపు చేపట్టగా ఇద్దరు బాలికల మృతదేహాలు బయటపడ్డాయి.
ఘటనపై ఏసీపీ విజయ్ కుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతల చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో జూబ్లీనగర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
