హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ‘మెరుపు’ దాడులు.. కోట్లలో అక్రమ లావాదేవీలు బట్టబయలు!
హనుమకొండ: అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు హనుమకొండ జిల్లాలోని వరంగల్ (R.O) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై విరుచుకుపడ్డారు. గురువారం (ఏప్రిల్ 2) జరిగిన ఈ ఆకస్మిక తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల మధ్య సాగిన ‘డిజిటల్’ లంచాల భాగోతం బట్టబయలైంది.

- SROల ఇళ్లలో నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం సీజ్.
- ఫోన్‌పే ద్వారా రూ. 42 లక్షల అక్రమ లావాదేవీలు.
- 20 మంది అనధికార ఏజెంట్ల అరెస్ట్ – 204 డాక్యుమెంట్లు స్వాధీనం.
వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న నమ్మదగిన సమాచారంతో ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. సోదాల సమయంలో కార్యాలయంలో తిష్టవేసిన 20 మంది అనధికార ఏజెంట్లను/డాక్యుమెంట్ రైటర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 47,450 నగదుతో పాటు, 70 అన్‌రిజిస్టర్డ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
డిజిటల్ లంచాల పర్వం:
నిందితులైన డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లను పరిశీలించగా.. SRO-I జమలాపురం రమణసింహారావు, SRO-II దావులూరి ఆనంద్ లు లంచాల కోసం వాట్సాప్ చాటింగ్‌లు చేసినట్లు తేలింది. గత ఏడాది కాలంలో కేవలం ఫోన్‌పే (PhonePe) ద్వారానే సుమారు రూ. 42,03,125 లంచంగా తీసుకున్నట్లు ఆధారాలు లభించాయి.
ఇళ్లలో సోదాలు – కుప్పలుగా బంగారం, వెండి:
కార్యాలయంతో పాటు ఇద్దరు ఎస్ఆర్ఓల నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది. ముఖ్యంగా SRO-II దావులూరి ఆనంద్ ఇంట్లో దొరికిన సంపద చూసి అధికారులు విస్తుపోయారు. - నగదు: రూ. 24,61,540
- బంగారం: 819.500 గ్రాములు
- వెండి: 2.600 కిలోలు
- డిపాజిట్లు: కపిల్ చిట్స్‌లో రూ. 30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు.
అంతేకాకుండా, ప్రజలకు అందజేయాల్సిన 204 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను పంపిణీ చేయకుండా అధికారులే తమ వద్ద అట్టిపెట్టుకున్నట్లు గుర్తించారు. ఈ అవినీతి తిమింగలాలపై తదుపరి చర్యల కోసం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
ప్రజలకు విజ్ఞప్తి: ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయండి.
