కౌశిక్ రెడ్డి అరాచకాలు సాగనివ్వం: వొడితల ప్రణవ్

- డంపింగ్ యార్డు మార్పునకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- ఎమ్మెల్యే పదవికి కౌశిక్ అనర్హుడు, వెంటనే భర్తరఫ్ చేయాలి
- హుజూరాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ ధ్వజం
హుజూరాబాద్, ఏప్రిల్ 02(Zindagi9News):
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం హుజూరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
సీనియర్ నేత పట్ల వివక్ష దారుణం
అసెంబ్లీ సాక్షిగా సీనియర్ దళిత నాయకుడు, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రదర్శించిన వివక్షా పూరిత వైఖరి సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ప్రణవ్ మండిపడ్డారు. గతంలో గవర్నర్‌ను, వివిధ కులాలను, మతాలను విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందని, జర్నలిస్టులు, వ్యాపారస్తులను బెదిరిస్తూ అరాచకవాదిగా తయారయ్యారని విమర్శించారు.
డంపింగ్ యార్డుపై ‘రాజకీయ నాటకం’
హుజూరాబాద్ డంపింగ్ యార్డు అంశంపై కౌశిక్ రెడ్డి కొత్త డ్రామాలు ఆడుతున్నారని ప్రణవ్ ఎద్దేవా చేశారు.
- మార్పునకు కట్టుబడి ఉన్నాం: డంపింగ్ యార్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, ఇప్పటికే మున్సిపాలిటీలో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేశామని స్పష్టం చేశారు. త్వరలోనే అఖిలపక్ష నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
- డైవర్షన్ పాలిటిక్స్: తనపై ఉన్న సీబీఐ, సీఐడీ విచారణల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే కౌశిక్ రెడ్డి బంద్ పిలుపులు, దీక్షలు అంటున్నారని విమర్శించారు. 2022లో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
దళిత వ్యతిరేకి కౌశిక్ రెడ్డి
దళిత బంధు ఆపిందే కౌశిక్ రెడ్డి అని ప్రణవ్ ఆరోపించారు. “చంపినోడే సంతాప సభ పెట్టినట్లు” కౌశిక్ రెడ్డి తీరు ఉందని, ఓట్ల కోసం దళితులను వాడుకున్నారే తప్ప వారి అభ్యున్నతి కోసం పనిచేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లబ్ధిదారులకు న్యాయం చేస్తోందని పేర్కొన్నారు.
రైతులకు భరోసా: చివరి ఆయకట్టు వరకు సాగునీరు
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రణవ్ భరోసా ఇచ్చారు. చివరి ఆయకట్టు వరకు నీరు అందించే విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడారని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.
ఈ సమావేశంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ సుహాసిని, కౌన్సిలర్లు, మండల, పట్టణ అధ్యక్షులు మరియు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
