
ఏసీబీ వలలో కోర్టు సిబ్బంది.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వైనం
జయశంకర్ భూపాలపల్లి (Zindagi9News): జిల్లా కేంద్రంలోని ప్రధాన మరియు సెషన్స్ కోర్టులో అవినీతి తిమింగలాలు ఏసీబీ అధికారులకు చిక్కాయి. ఒక అధికారిక పని కోసం లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ముగ్గురు కోర్టు సిబ్బందిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో స్టెనో గ్రేడ్-1గా పనిచేస్తున్న పాలకుర్తి సాయి చరణ్, ఒక కేసు (A.S. No. 03/2023) కు సంబంధించిన తీర్పు కాపీని ఫిర్యాదుదారుడికి అందజేయడానికి 5,000 రూపాయల లంచం డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో, సాయి చరణ్ సూచన మేరకు సబార్డినేట్లుగా పనిచేస్తున్న కొమ్ము సునీత, పున్నం రజిత ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
