
వీణవంక ఎస్సీ మహిళా సర్పంచ్కు ఆలయ దర్శనం నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్కు వినతిపత్రం
వీణవంక, ఫిబ్రవరి 4:వీణవంక గ్రామంలో ఎస్సీ మహిళా సర్పంచ్ హక్కులపై జరిగిన ఘటన కలకలం రేపింది. ప్రజల చేత ఎన్నికైన వీణవంక గ్రామ సర్పంచ్ దాసరపు సరోజనను శ్రీ సమ్మక్క–సారలమ్మ తల్లుల ఆలయ దర్శనానికి వెళ్లిన సమయంలో పోలీసులు అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన సర్పంచ్ను దర్శనం చేయకుండా అడ్డుకోవడం దళిత మహిళ గౌరవానికి భంగం కలిగించడమేనని దళిత సంఘాల నాయకులు ఆరోపించారు. ఇది అధికార దుర్వినియోగంతో పాటు రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు.ఈ ఘటనలో హుజురాబాద్ ఏసిపి మాధవి, జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణతో పాటు ఇతర పోలీసు అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఎస్సీ హక్కుల కోసం పోరాడే సంఘాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఘటనపై స్వతంత్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీణవంక గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
