ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి వచ్చిన ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ – ఫిరాయింపులతో ప్రజాస్వామ్యానికి మచ్చ
స్పీకర్ తీర్పుపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు, ప్రజలకు పిలుపు
సిరిసిల్ల:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీభవన్లోనే సంసారం చేస్తూ, జిల్లా కాంగ్రెస్ కార్యాలయాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ బి.ఫాంలు ఇచ్చి, వారికే టిక్కెట్లు పంచుతున్నారని విమర్శించారు.
ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ కేసును కొట్టివేయడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు.
“స్పీకర్ సార్… మీరు నిజాయితీపరులు. మీరు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే. కానీ మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. కళ్లముందే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కార్యాలయాల్లో తిరుగుతున్నా, పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసులు కొట్టివేయడం తగదు. దీని వల్ల మీపై మచ్చ పడుతుంది. చరిత్రలో మసకబారే పరిస్థితి వస్తుంది. మీ తీర్పును చూసి జనం నవ్వుకుంటున్నారు” అని తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుపునిచ్చారు.
“ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి. మీరు ఏ పార్టీ తరపున వచ్చారు? ఏ పార్టీని గెలిపించాలని చెబుతున్నారు? ఏ పార్టీ అభ్యర్థికి ఓటేయమంటున్నారు? ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీ కండువా కప్పుకుని ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా ప్రశ్నించండి” అన్నారు.
బీజేపీ రాజకీయ వ్యభిచారం చేయదని, ప్రజాస్వామ్య స్పూర్తితోనే పనిచేస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు. ఇందుకు ఉదాహరణగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి తీసుకున్నామని గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల ఫిరాయింపు రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని, వీటికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని బండి సంజయ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
