
జమ్మికుంట శివారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తింపు
జమ్మికుంట: జమ్మికుంట పట్టణ శివారులోని కాకతీయ డిజి స్కూల్ వెనుక వైపు వాగు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించబడింది. ఈ ఘటనకు సంబంధించి జమ్మికుంట మున్సిపాలిటీలో సానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పర్ల మహేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గురువారం రోజున మధ్యాహ్నం కటికవాడ గ్రామానికి చెందిన ఎండి సల్మాన్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మేకలను మేపుకుంటూ వెళ్లిన సమయంలో వాగు ప్రాంతంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల గుర్తుతెలియని వ్యక్తి కదలికలేని స్థితిలో కనిపించాడని తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతి జరిగి కొన్ని రోజులుగా అయి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతుడి వివరాలను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
