
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి
చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద విషాద ఘటన – మృతుల సంఖ్య పెరిగే అవకాశం
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద హైదరాబాద్–బీజాపూర్ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీని తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఈ విషాద ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌తో పాటు 17 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఢీకొన్న ప్రభావంతో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ నుండి కంకర బస్సులోకి చేరడంతో కొంతమంది ప్రయాణికులు కంకర కింద కూరుకుపోయారు.
స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

